అరెకరం భూమి తమది కాకుండా పోతుందనే బెంగతో మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామంలో రైతు టెంకటి చిన్నరామయ్య (64) హఠాన్మరణం (Farmer died in Medak district) చెందారు. ఆయనకు భార్య దేవమ్మ, కుమారులు సాయిలు, బుచ్చయ్య ఉన్నారు. గ్రామంలో ఇనాం భూములు ఉన్నాయి. ఇవన్నీ అప్పటి సంస్థానాధీశారులైన రాణి శంకరమ్మకు చెందినవి. సుమారు 150 మంది రైతులు 77 ఎకరాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు.
ఎప్పటికైనా ఓఆర్‌సీ వచ్చి తమ పేరిట పట్టాదారు పాసుపుస్తకాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ ధరణి వచ్చాక కాస్తులో ఉన్న వారి పేర్లన్నీ తొలగించేశారు. రాణి శంకరమ్మ వారసుల పేరు మీదకు మారిపోయింది. వారు ఇతరులకు అమ్మేశారు. కొన్నవారు వచ్చి సర్వే చేపట్టగా రైతులు అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులనూ కలిసి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు సరికొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. ఇనాం భూములను తిరిగి కాస్తులో ఉన్న రైతుల పేర్ల మీదకు మార్చాలంటే ఎకరాకు రూ.4 లక్షల చొప్పున ఇవ్వాలని పట్టుబట్టారు.
‘‘నాన్న సర్వే నంబరు 82లో ఉన్న అరెకరం భూమి తనది కాకుండా పోతుందనే ఆవేదన చెందుతున్నారు. ఆ భూమి కోసం రూ.2 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలని మదనపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు’
-సాయిలు, చిన్నరామయ్య కుమారుడు
ఇదీ చూడండి: 4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి