మంచిర్యాలలో నకిలీ ఐఏఎస్ బాగోతం బట్టబయలైంది. ఉద్యోగాల పేరుతో యువత నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. తీరా ఉద్యోగాలు రాకపోయేసరికి బాధితులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అతని కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన నిందితుడు బర్ల లక్ష్మీనారాయణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
నకిలీ ఐఏఎస్ పేరుతో దాదాపు 36 మంది నిరుద్యోగ యువత ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితులంతా జగిత్యాల జిల్లాకు చెందిన వారే. తనకు కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని ప్రభుత్వ శాఖల్లో తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలపడంతో లక్ష్మీనారాయణ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న రమేశ్ తన సమీప బంధువులను పరిచయం చేశాడు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నకిలీ ఐఏఎస్ కార్యాలయాన్ని సోదా చేసి.. పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.