Ganja smuggling: పుష్ప సినిమాలో పాటలు ఎంత ఫేమస్ అయ్యాయో.. అక్రమ రవాణా ఎలా చేయాలనే ట్రిక్స్ కూడా అంతే పాపులర్ అయ్యాయి. ఆ సినిమాలో ఎర్ర చందనాన్ని ఎలాగైతే పాల వ్యాన్ మధ్యలో పెట్టి తరలించారో.. ఇక్కడ కూడా అలాంటి ఓ వినూత్న పద్ధతి ద్వారా గంజాయిని తరలించే ప్రయత్నం చేశారు కొందరు స్మగ్లర్లు. అయితే.. సినిమాలోలాగా పాల వ్యాన్లో కాకుండా.. కారు డోర్ల సందుల్లో పెట్టి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుందామనుకున్నారు. కానీ.. దొరికిపోయారు.
పుష్ప ప్రభావం: గంజాయి రవాణా చేస్తున్న రెండు స్కార్పియో వాహనాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు శివారులో జరిగింది. గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు.. పాడేరు మండలం చింతలవీధి కూడలి వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో.. దిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన రెండు స్కార్పియో వాహనాలు అటువైపుగా వచ్చాయి. గమనించిన పోలీసులు.. వాటిని అడ్డగించి తనిఖీలు చేపట్టారు. వాహనాలను మొత్తం జల్లెడ పట్టిన పోలీసులకు ఏమీ దొరకలేదు. అనుమానమోచ్చిన పోలీసులు.. స్మగ్లర్ల అతితెలివిని గ్రహించి చాకచక్యంగా మరోసారి తనిఖీ చేశారు. ఈసారి ఇట్టే దొరికిపోయాయి. స్మగ్లర్లు.. సినీఫక్కీలో డోర్ల మధ్య గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: