ED Raids in Delhi Liquor Scam : దిల్లీ సర్కార్ తీసుకువచ్చిన మద్యం వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. నూతన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై ఆగస్టు 19న సీబీఐ కేసు నమోదు చేసింది.
ED Raids in Hyderabad over Delhi Liquor Scam : హైదరాబాద్‌లో నివాసముంటున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని సైతం ఈ కేసులో నిందితునిగా పేర్కొనడంతో.. అప్పుడే సీబీఐ అధికారులు కోకాపేటలోని ఆయన నివాసంలో సోదాలు జరిపారు. రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ, రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయా సంస్థల్లో హైదరాబాద్‌కే చెందిన అభిషేక్ బోయినపల్లి, ప్రేంసాగర్ గండ్ర సహడైరెక్టర్లుగా ఉన్నారు. దిల్లీలో మద్యం సరఫరాకు సంబంధించి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో ఈ రెండూ ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం తెరచాటు వ్యవహారం నడిపినట్లు... దీని ద్వారా అనేకమంది లబ్ధిపొందారన్నది దర్యాప్తు సంస్థల అనుమానం.
ED Raids all over India in Delhi Liquor Scam : లిక్కర్ పాలసీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంపై 'ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్' చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 6న హైదరాబాద్‌లో సోదాలు జరిపారు. తాజాగా శుక్రవారం మరోసారి తనిఖీలు చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈ కేసులో నిందితునిగా పేర్కొన్నందున... ఆయనతో కలిసి వ్యాపారాలు నిర్వహించిన పలువురి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు.
రాబిన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి సహడైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ బోయినపల్లికి మరో 9 సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఇందులో అనూస్ ఎలక్ట్రోలిసిస్ అండ్ ఒబెసిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒకటి. మాదాపూర్ జూబ్లీఎన్ క్లేవ్‌లోని ప్రణవ అలేఖ్య హోమ్స్‌లో ఉన్న దీని కార్పొరేట్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే మద్యం సరఫరా సంస్థలకు ఆడిటింగ్ కార్యకలాపాలు నిర్వహించిందని భావిస్తున్న.. దోమల్‌గూడ, అరవింద్‌నగర్‌లోని శ్రీసాయి కృష్ణా రెసిడెన్సీలో ఉన్న గోరుంట్ల బుచ్చిబాబుకు చెందిన గోరుంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో తనిఖీలు జరిపారు. ఇదే సంస్థకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
బోయినపల్లి అభిషేక్ డైరెక్టర్‌గా ఉన్న మాస్టర్ శాండ్ ఎల్‌ఎల్‌పీ, అగస్తి వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థల్లో డిజిగ్నేటెడ్ డైరెక్టర్‌గా ఉన్న అభినవ్‌రెడ్డి ఇళ్లు , కార్యాలయల్లోనూ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి చెందిన ట్రైడెంట్ చిమర్ లిమిటెడ్ సంస్థలో సోదాలు జరిగాయి. అలానే చెన్నైలో ఏంజెల్స్ షాంపైన్ ఎల్‌ఎల్‌పీ, తమిళనాడు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించారు. ఇవి కూడా మాగుంటకి చెందినవేనని భావిస్తున్నారు. సోదాల సందర్భంగా అనేక కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో మొదలైన సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి.
రాజకీయంగా సంచలనం రేపుతుండటంతో దిల్లీ ఈడీ అధికారులు.. ఈ మొత్తం తతంగాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. స్థానిక ఈడీ అధికారులకు సైతం సమాచారం ఇవ్వడంలేదు. ముందుగానే ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించుకోవాలో తెలుసుకుని వచ్చిన అధికారులు......శుక్రవారం సరాసరి తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లారు. స్థానిక అధికారులను కూడా తమతో తీసుకువెళ్లినా.... వారిని కేవలం అవసరమైన దస్త్రాలు రాయించడానికి మాత్రమే వినియోగించారు. కాగా.... సోదాల సందర్భంగా ఈడీ అధికారులు పలువురికి నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా.... అధికారికంగా మాత్రం దీనిని ఎవరూ ధ్రువీకరించలేదు.