బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కుటుంబానికి చెందిన 25 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కోల్‌కతా ఈడీ అటాచ్ చేసింది. సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్ కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్‌కతా ఈడీ తాత్కాలిక జప్తు చేసింది.
కోల్‌కతా డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపారు. గతంలోనే ప్రీతం కుమార్ అగర్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. విదేశాలకు ఎగుమతి పేరుతో ఎంఎంటీఎసీ, ఎస్టీసీ, డైమండ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డ్యూటీ ఫ్రీ బంగారం కొనుగోలు చేసి.. అక్రమంగా దేశీయంగా వ్యాపారం చేసినట్లు అభియోగం. హైదరాబాద్‌లోని అయిదు ప్రాంతాల్లో గతంలో ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. దర్యాప్తు చేసిన కోల్‌కతా అధికారులు సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్ పేరిట ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ముగ్గురిపై కోల్‌కతా కోర్టు నాన్‌బెయిల్ వారంట్ జారీ చేసింది.
కేసు ఏంటంటే..
బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన శ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కుమారుడు ప్రీతం కుమార్ అగర్వాల్‌ను ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గతంలో అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. కోల్‌కత్తాలో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేపట్టగా దాదాపు 250 కిలోల బంగారాన్ని పలు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసి.. వాటిని ఎలాంటి పన్ను కట్టకుండా పలువురికి విక్రయించినట్లు గుర్తించారు. హవాలా మార్గంలో తరలించినట్లు తేలడంతో డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్‌లోని ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సుంకం ఎగవేసి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
సంబంధిత కథనం: 250 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఓ వ్యాపారి అరెస్టు