దర్భాంగా రైల్వేస్టేషన్లో పేలుళ్లకు సంబంధించిన కుట్ర పాకిస్థాన్ కేంద్రంగా జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్ల విషయంలో హస్తం ఉందని అనుమానిస్తున్న పలువురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో నసీర్, ఇమ్రాన్ అనబడే ఇద్దరు సోదరుల గురించి దర్యాప్తు చేయగా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రధాన అనుమానితునిగా ఉన్న నసీర్ మూడుసార్లు పాకిస్థాన్‌కు వెళ్లొచ్చినట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది.
నకిలీ చిరునామాతో...
55 కిలోల బరువున్న చీరల పార్శిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను నిందితులు ఉంచారు. ఈ నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్శిల్‌ను దర్బాంగాకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్‌కార్డు చూపించి పంపించారు. దర్బాంగాలో పార్శిల్ తీసుకునే వ్యక్తి పేరు కూడా సూఫియాన్ అనే రాసి ఉంచారు. చరవాణి నెంబర్ కూడా నకిలీదే ఇచ్చారు. 17న దర్బాంగాలో పార్శిల్‌ను రైల్లోంచి తీసిన తర్వాత స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు...
ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానాకు చెందిన నసీర్ రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఆసీఫ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ హైదరాబాద్‌కు చెందిన యువతినే పెళ్లి చేసుకున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏడాది క్రితం నసీర్ సోదరుడు ఇమ్రాన్ కూడా హైదరాబాద్‌కు వచ్చి ఆసిఫ్‌నగర్‌లోనే మరో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే వీళ్లిద్దరూ... ఓ ఉగ్రవాది ఆదేశాలు పాటిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్లాన్ చేసింది.. రైల్లోనా?.. విమానంలోనా..?
ఖైరానా ప్రాంతానికి చెందిన ఓ ఉగ్రవాది ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. అతడి ఆదేశాల మేరకే నసీర్.. రసాయనాలతో పేలుడు జరపడానికి శిక్షణ కూడా పొందినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ విషయమై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. నసీర్, ఇమ్రాన్‌లతో పాటు మిగతా అనుమానితులు కూడా ఈ పేలుళ్ల కేసులో ఉన్నారా...? ఉంటే.. వారికి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి..? లాంటి కీలక అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
రసాయన సీసాను పార్శిల్లో పంపిన దాన్ని బట్టి రైల్లోనే పేలుడు జరపాలనున్నారా...? దర్బాంగా రైల్వేస్టేషన్ నుంచి ఆ పార్సిల్‌ను విమానంలో తరలించి విమానంలో పేలుడు జరపాలనుకున్నారా...? అనే కోణంలోనూ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.