బంగారం దొంగతనం చేశావనే అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాపూజీనగర్‌లో నివాసం ఉండే సాయికుమార్‌చారి(31) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. క్యాబ్ సరిగా నడవకపోవడంతో ప్రస్తుతం పెయింటింగ్ వర్క్ కాంట్రాక్టర్ దగ్గర రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బోయిన్‌పల్లిలోని ఓ ఇంట్లో సాయికుమార్.. వారం రోజుల క్రితం పనికోసం వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో 2 గ్రాముల బంగారు ఆభరణం పోయింది. దీంతో ఆ ఇంటి యజమాని.. ఈ దొంగతనం అతనే చేశాడని అనుమానంతో చారిని ప్రశ్నించాడు. అవమానంగా భావించిన సాయికుమార్‌చారి.. ఆ ఆభరణం విలువ సొమ్మును ఆదివారంలోపు ఇస్తానని ఒప్పుకున్నాడు.
డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మళ్లీ అవమానం పాలుకావడం ఇష్టం లేక ఈరోజు తెల్లవారుజామున.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ఇదీ చదవండి: జిల్లాలో దొంగల హల్చల్