Cybercriminals cheated a doctor in Hyderabad: సైబర్ క్రైమ్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రోజు రోజుకీ సాంకేతిక పెరుగుతుంటే అంతకంతకూ మోసాలూ అధికమవుతున్నాయి. దాన్ని ఉపయోగించుకుని కొత్త కొత్త ఉపాయాలతో సైబర్ నేరగాళ్లు జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు. వాళ్ల దెబ్బకు ఉన్నత చదువులు చదివిన వారు సైతం మోసపోతున్నారు. ఇప్పటికే వివిధ రకాల సందేశాలు, ఫోన్లకు లింకులు పంపించి జనాలను మోసం చేసిన వారు... ఇప్పుడు కస్టమ్స్ అధికారుల అవతారం ఎత్తి దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనే జరిగింది హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
మెహదీపట్నంలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే వైద్యురాలికి వారం క్రితం ఓ ఫోన్ వచ్చింది. ముంబయి క్రైం బ్రాంచి నుంచి ఫోన్ చేస్తున్నామని, ఇటీవల మీరు విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నారని చెప్పారు. అలాంటిదేమీ లేదని ఆమె వివరణ ఇచ్చినా.. అవతలి వ్యక్తులు ఆగలేదు. అది నిజమే అంటూ బెదిరింపులకు దిగారు. వైద్యురాలి పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరి పేర్లు చెప్పారు. ఇవన్నీ సరైనవే కావడంతో ఆమె ఆలోచనలో పడ్డారు. జరిమానా కింద వెంటనే రూ.50 వేలు చెల్లించకపోతే, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించారు.
పోలీసులు ఇంటికి వస్తే పరువు పోతుందని భయపడిపోయిన ఆమె... వాళ్లు చెప్పిన ఖాతాకు అడిగినంత నగదు బదిలీ చేశారు. వారం తిరిగక ముందే మళ్లీ ఫోన్ వచ్చింది. ఈ సారి కేసులో పూర్తి ఆధారాలు లభించాయని, న్యాయస్థానంలో పిటిషన్ వేయకుండా ఉండాలంటే మరో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మరోసారి ఆ సొమ్ము చెల్లించారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో చేసేది ఏమీ లేక హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాధితురాలు జమ చేసిన బ్యాంకు ఖాతా ఆధారంగా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
కొంతమంది సైబర్ నేరగాళ్లు దొడ్డి దారిన వివరాలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓఎల్ఎక్స్, ఉద్యోగాలు, బహుమతులు, బీమా, క్రెడిట్, డెబిట్ కార్డుల జారీ పేర్లతో మోసం చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం అంటూ... లింక్ ఓపెన్ చేస్తే బహుమతులు వస్తాయని, టీవీ షోలో ఎంపికయ్యారని, లాటరీ తగిలిందని నమ్మించి ఆ మొత్తం ఇవ్వాలంటే సర్వీస్ టాక్స్‌ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.
అందుకే సైబర్ నేరాల నియంత్రణ పై అవగాహన పెంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా వాళ్ల వాళ్ల ప్రాంతాల పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ మోసాలబారిన పడిన వాళ్లు జాతీయ స్థాయిలో 112కు లేదా 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేకపోతే ఆన్ లైన్‌లో సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: