ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన సరితకు గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అంటూ మాట కలిపింది. ఆ కిలేడిని నమ్మిన సరిత ఉద్యోగం కావాలని చెప్పడంతో తన పని మొదలు పెట్టింది.
ముందుగా రూ.49తో తాము పంపే లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. అది నమ్మిన సరిత తన డెబిట్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగా.. రూ.49 బదులుగా రూ.9,996 అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి. ఈ విషయమై సైబర్ లేడిని ప్రశ్నించగా.. తప్పు జరిగిందని, మరోసారి డబ్బులు పంపండంటూ లింక్ పంపింది.
నమ్మి మరోసారి లింక్ ఓపెన్ చేసి ఓటీపీ చెప్పగా.. మరో రూ.9,996 అకౌండ్ నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో రెండు విడతల్లో రూ.19,992 నగదు పోగొట్టుకుంది. మరోసారి తప్పు జరిగిందంటూ ఆ కిలేడి నమ్మించే ప్రయత్నం చేయగా.. తేరుకున్న బాధితురాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.