కోట్ల రూపాయల ఆస్తి లేకపోయినా... పిల్లలనే ఆస్తిగా భావించారు. ఇద్దరు కొడుకులతో కలిసి హాయిగా జీవనం సాగించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టలేని స్థితికి చేరారు. ఏ పని చేసైనా పిల్లల కడుపు నింపాలనుకున్న ఆ దంపతులకు భాగ్యనగరంలో ఉపాధి కరవైంది. తన బిడ్డల ఆకలి తీర్చలేని తాము బతికి లాభం లేదనుకున్నారు. పిల్లలను తల్లిదండ్రుల వద్ద విడిచి పురుగుల మందు తాగారు. కుమారులను అనాథలుగా మార్చి ప్రాణాలను(COUPLE SUICIDE) వదిలారు.
కరోనాతో కుంటుపడ్డ వ్యాపారం..
మెదక్ జిల్లా పోతిన్ పల్లికి చెందిన కిషోర్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు. ఉపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం వీరు హైదరాబాద్కు తరలివచ్చారు. చిలకల గూడలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని క్షౌరశాల(HAIR SALOON) నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. ఉన్నంతలో తమ ఇద్దరు కుమారులతో సంతోషంగా బతికేవారు. కానీ కరోనా రూపంలో వారికి కష్టాలు మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా క్షౌరశాలకు పూర్తిగా గిరాకీ తగ్గిపోయింది. ఏడాదికి పైగా వ్యాపారం నడవకపోవడంతో ఆర్థికంగా బాగా(FINANCIAL PROBLEMS) చితికిపోయారు. పిల్లల కడుపు నింపేందుకు కూడా డబ్బులు లేని స్థితికి చేరిపోయారు.
బుక్కెడు బువ్వపెట్టలేక ఆత్మహత్య...
నాలుగు రోజుల క్రితం కిషోర్, కవిత దంపతులు తమ పిల్లలతో కలిసి వారి స్వస్థలమైన పోతిన్ పల్లికి వెళ్లారు. బుధవారం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. పిల్లలను తన తండ్రి మల్లేష్తో బస్సులో పంపించిన కిషోర్.. భార్య కవితను తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. మార్గ మధ్యలో తూప్రాన్ వద్ద పురుగుల మందు(Insecticide) కొనుగోలు చేశారు. మాసాయిపేట సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఆ దంపతులిద్దరూ పురుగుల మందు తాగారు.
కడుపుమంట భరించలేక...
కడుపులో మంట తీవ్రమవడంతో.. దానిని భరించలేక భార్యాభర్తలిద్దరూ వారి ద్విచక్రవాహనంపై తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం కవిత మృతి చెందింది. ఉస్మానియా అసుపత్రిలో కిషోర్ ఈ రోజు తెల్లవారుజామున చనిపోయాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు.
ఎన్నో ఆశలతో భాగ్యనగరానికి చేరుకున్న ఈ దంపతుల కథ విషాదాంతమయింది. కరోనా ప్రళయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇలా అనేక మంది జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి.
ఇదీ చూడండి: Suicide : ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య