Couple Fraud: సగం ధరలకే విమానం టిక్కెట్లు..తక్కువ ధరకే ఐఫోన్లు ఇప్పిస్తామంటూ కర్ణాటకలోని బెల్గాంలో ఉంటున్న కిలాడీ దంపతులు మోసాలకు తెరతీశారు. సామాజిక మాధ్యమాలు, మెట్రో నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్, గోవా, బెంగళూరు, మంగుళూరు, కోల్‌కతా, ముంబయి వంటి నగరాలకు టిక్కెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. విమానాశ్రయాల్లోని కస్టమ్స్ విభాగంలో తమకు బంధువులున్నారని, రూ.80వేల ఐ-ఫోన్ 45వేలకే ఇస్తామంటూ నమ్మించారు. కొద్దినెలల్లోనే రూ.లక్షలు వసూలు చేసుకున్నారు. విమానం టిక్కెట్లు పంపాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు నిలదీయగా మీ దిక్కున్నచోట చెప్పుకోండి అంటూ బెదిరించారు. కిలాడి దంపతులను నమ్మి రూ.20లక్షలు ఇచ్చిన ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు బెల్గాంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితులు హైదరాబాద్‌లో ఉంటున్నారని బెల్గాం పోలీసులు గుర్తించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసిన ఇతర బాధితులు ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
డ్రీమ్‌ఫ్లై ఏవియేషన్ పేరుతో.. బెల్గాంలో నివాసముంటున్న సుదర్శన్, సుజాత.. కొన్నేళ్ల నుంచి డ్రీమ్‌ఫ్లై ఏవియేషన్, హాస్పిటాలిటీ అకాడమీ పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. కార్పొరేటు సంస్థలు, బృందాలకు చిన్న విమానాలను సమకూర్చడం, వేర్వేరు నగరాలకు విమానటిక్కెట్లు, పంచతార హోటళ్లలోనూ వసతి ఏర్పాటు చేసి డబ్బులు తీసుకుంటున్నారు. కొద్దినెలల క్రితం హైదరాబాద్‌లోని చాణక్య, ఉత్తమ్ తమ వినియోగదారులకు విమాన టిక్కెట్లు, హోటళ్లలో వసతి కల్పించాలంటూ వారిని కోరారు. టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఇస్తానంటూ సుదర్శన్ చెప్పడంతో పదుల సంఖ్యలో టిక్కెట్లు కొన్నారు. అప్పుడు రాయితీలు ఇచ్చారు. అనంతరం రూ.20 లక్షలు డిపాజిట్‌గా ఉంచాలంటూ సుదర్శన్ కోరడంతో నాలుగు నెలల క్రితం ఇచ్చారు. తర్వాత విమాన టిక్కెట్లు బుక్‌చేయగా రాయితీ ఇవ్వలేదు. అదేమని ప్రశ్నించగా బదులివ్వలేదు.
ఐ-ఫోన్లు, ఐ-ప్యాడ్‌లు ఇస్తామంటూ.. ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులతో సుదర్శన్, సుజాతలు మాట్లాడుతున్నప్పుడు తక్కువ ధరలకే ఐ-ఫోన్లు, ఐ-ప్యాడ్‌లు ఇస్తామంటూ చెప్పారు. ఒకటి, రెండు ఐ-ఫోన్లు రూ.45వేలు, రూ.55వేలకే ఇచ్చారు. దీంతో చాణక్య స్నేహితులు, సుదర్శన్ వద్ద రాయితీ విమాన టిక్కెట్లు కొన్నవారిలో కొందరు తమకూ ఐ-ఫోన్లు, ఐ-ప్యాడ్‌లు కావాలంటూ రూ.వేలల్లో డబ్బులు ఇచ్చారు. బాధితుల నుంచి డబ్బు తీసుకున్న సుదర్శన్ వారికి ఫోన్లు, ప్యాడ్‌లు ఇవ్వలేదు. అడిగితే దాటవేస్తూ వచ్చారు. బెల్గాంలో వారు లేకపోవడంతో బాధితులు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.