ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్ల దొంగతనాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీసీఎస్, కందుకూరు పోలీసులు, ఎల్బీనగర్ నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 లక్షల నగదు, 160 కిలోల కాపర్ వైర్, నాలుగు ద్విచక్రవాహనాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీటన్నింటి విలువ రూ. 25లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
నిందితులు నందులాల్ రాజ్బర్, అభిమాన్యు రాజ్బర్ ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులైన సహదేవ్, రాహుల్ రాజ్బర్ పరారీలో ఉన్నట్లు వివరించారు. మిగితా ఇద్దరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
వీళ్లు ఏం చేస్తారంటే..?
"నలుగురు నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో నివాసముంటున్నారు. వీళ్లు ఉదయం పూట ఐసోలేటెడ్ ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసి.. రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి పూట వెళ్లి కర్రతో కొట్టి కరెంట్ ఆపేస్తారు. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఎవరైనా వస్తున్నారా లేదా అని వేచి ఉంటారు. ఎవరు రావట్లేదని నిర్ధరించుకుని ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్‌ను తీసుకుంటారు. అక్కడికి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలో దాచి పెడతారు. తర్వాతి రోజు మళ్లీ వెళ్లి.. ఆ కాపర్‌వైర్‌ను స్క్రాప్ దుకాణంలో కానీ... మిగతా వాళ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఈక్రమంలో నిందితులు ఏకంగా 196 ట్రాన్స్ఫార్మర్లను పాడుచేసినట్టు తేలింది." -మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
77 కేసులు నమోదు..
ప్రధాన నిందితుడైన నందులాల్ రాజ్బర్.. 2012 నుంచి దొంగతనాలకు పాల్పడేవాడని విచారణలో వెల్లడైనట్టు తెలిపారు. 2012లో నాచారం పోలీసులు రిమాండ్ చేయగా.. ఏడాదిపాటు జైల్లో ఉన్నాడు. 2014లో నందులాల్ మరో ఏడుగురితో కలిసి 32 ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం చేసిన కేసుల్లో యాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో నిందితుడైన అభిమన్యు 16 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చి.. 2014 నుంచి ఈ నేరాల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. దాదాపు 32 నేరాల్లో పాలుపంచుకున్నట్టు వివరించారు. నిందితుల మీద రాచకొండలో 28 కేసులు, సైబరాబాద్‌లో 3, వికారాబాద్‌లో 42, సంగారెడ్డిలో 4 కేసులు కలిపి మొత్తం 77 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.
నిందితుల మీద.. 379 ఐపీసీ, పబ్లిక్ ప్రాపర్టీ సెక్షన్ 3, 136 ఎలక్ట్రిక్ సిటీ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ రివార్డు అందించారు.
ఇదీ చూడండి: