Treatment to dead body in private hospital: కరీంనగర్ నగరంలో పురుగుల మందు తాగి.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన బొజ్జ రమేష్ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
అసలేం జరిగిందంటే...
పెద్దపల్లి జిల్లా రామగుండం పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన బొజ్జ రమేష్ ఈ నెల 24న తన వ్యక్తిగత సమస్యలతో జీవితం మీద కలతచెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ వద్దకు ప్రథమ చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఈ నెల 24 నుంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అతను మృతి చెందినా... ఠాగూర్ సినిమాలోలాగా చికిత్స చేస్తున్నట్లు నటించారు.
'మా మామయ్యకు కొంచెం అప్పుల బాధ ఉంది. దాంతో కలత చెంది పురుగుల మందు తాగాడు. వెంటనే జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ వద్దకు ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లాం. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ ఆసుపత్రికి గురువారం తీసుకువచ్చాం. వెంటిలేషర్ పైన ఉంచితే కోలుకుంటాడని చెప్పారు. మొదట బాగానే ఉన్నా.. తర్వాత చనిపోయిన రోగికి సెలైన్ ఎక్కించారు. ఈ రోజు మీరు రూ.20 వేలు కట్టండి అంటే చెల్లించాము. తర్వాత మీకు డబ్బులు కట్టే స్తోమత లేదు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లండి అన్నారు. రిపోర్ట్స్ ఇవ్వమంటే వాటిని చించేసి ఇచ్చారు.'
-రోగి బంధువు
'కన్నాల గ్రామం నుంచి ఈ నెల 24న పురుగుల మందు తాగి వచ్చిన రోగికి కోమా స్థితిలోనే ఉంచి వెంటిలేటర్ కనెక్ట్ చేశాం. అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. సోమవారం మధ్యాహ్నం 5 దశల చికిత్స అనంతరం రోగికి సీపీఆర్ చేశాం. అదే విషయం అతని కుటుంబసభ్యులకు తెలపడానికి పిలిచినప్పుడు 15 మంది ఐసీయూ లోపలికి వచ్చి నాపై, సిబ్బందిపై దాడికి దిగి రోగికి సంబంధించిన రికార్డ్స్ తీసుకెళ్లారు. అయినా చికిత్స అందిస్తూ జరిగిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అతను చనిపోయింది రాత్రి 9:50కి మెడికల్ నిబంధనల ప్రకారం మృతిచెందిన 4 గంటలలోపు రైగర్ మోడ్ టెస్టు చేయించాలి. కానీ ఇప్పటివరకు మా దగ్గర అది నమోదుకాలేదు.'
-ఆసుపత్రి వైద్యుడు
అనుమానం రావడంతో..
తరువాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలుపగా.. అనుమానం వచ్చిన బంధువులు ఐసీయూలోకి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించుకున్నారు. దాంతో బంధువులు అడ్డుకొని ఆస్పత్రి ఎదుట గొడవకు దిగారు. చివరకు నాలుగు గంటల ఆందోళన అనంతరం ఆసుపత్రి యాజమాన్యంతో రెండు లక్షల రూపాయలకు సయోధ్య కుదుర్చుకొని వెళ్లిపోయారని సమాచారం.
ఇదీ చదవండి:Mother suicide with children: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి