ఆకర్షణీయమైన బ్రోచర్లతో విలువైన వస్తువులను ఎర చూపి నెలనెలా డబ్బులు కట్టించుకొని సులువుగా డబ్బు సంపాదించేందుకు కొందరు అలవాటు పడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో బృందాలుగా ఏర్పడి లక్కీడ్రాల(Lucky Draw Cheating)ను నిర్వహిస్తున్నారు. ఒక్కోదాంట్లో వెయ్యి నుంచి 3500 మంది సభ్యులను చేర్చుకుంటున్నారు. ప్రతి సభ్యుడు నెలకు రూ.500 నుంచి రూ.2 వేలు చెల్లించేలా వీటిని రూపొందిస్తున్నారు.
ప్రతినెల ఒక లక్కీ డ్రా, మధ్యమధ్యలో బంపర్ డ్రాలు తీసి విజేతలకు విలువైన బహుమతులు అందజేస్తామని చెబుతూ నమ్మిస్తున్నారు. అమాయకులైన ప్రజలను నమ్మించి సభ్యులుగా చేర్చుకుంటున్నారు. పల్లెల్లో కమీషన్ పద్ధతిన కొందరు ఏజెంట్లను నియమించుకొని దందాను సాగిస్తున్నారు. బంపర్ బహుమతులుగా రూ.లక్షల విలువైన కార్లు, ఇళ్ల స్థలాలు, బంగారం ఇస్తామని చెబుతుండటంతో ప్రజలు ఆకర్షితులవుతున్నారు. తీరా అర్ధాంతరంగా బోర్డు తిప్పేసి నిలువునా ముంచేస్తున్నారు.
లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు..
నిజామాబాద్ జిల్లాలో మూడ్రోజుల వ్యవధిలో రెండు లక్కీ డ్రా(Lucky Draw Cheating)ల నిర్వాహకుల అరెస్టు కలకలం రేపింది. రహస్యంగా తీస్తున్న డ్రాలో ఎవరికి బహుమతులు వస్తున్నాయో ఎందరికి ఇస్తున్నారో దేవుడికే తెలియాలి. చివరి వరకు డబ్బులు చెల్లించిన వారికి ఆ మొత్తానికి సరిపడా వస్తువులు ఇవ్వడం లేదు. ఇటీవల ఆర్మూర్ కేంద్రంగా లాటరీ నిర్వహించిన వ్యక్తులు 15 నెలల్లో ఒక్కో సభ్యుడు రూ.18వేలు చెల్లిస్తే, రూ.10 వేల విలువైన టీవీ, ఫ్రిజ్ అంటగట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏదో గృహోపకరణం ఇచ్చాం కదా అని దబాయించడంతో బాధితులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.
నేతల అండతో..
జిల్లాలో కొంతకాలంగా పదుల సంఖ్యలో లక్కీ డ్రాలు(Lucky Draw Cheating) నిర్వహిస్తున్నారు. కొంతమంది నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు స్థానిక పోలీసులకు ముడుపులు ముట్టజెప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ప్రతినెలా డ్రాలు తీస్తున్నా వారి గుట్టు బయటపడడం లేదు. బహిరంగంగా నిర్వహించేందుకు ప్రయత్నించిన వారే పట్టుబడుతున్నారు.
చర్యలు తీసుకోండి..
పెర్కిట్‌కు చెందిన ఐదుగురు జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో ఒక కల్యాణ వేదికలో గత వారం ఆర్భాటంగా లక్కీ డ్రా తీస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. అదే వారంలో ఆర్మూర్‌లో లక్కీ డ్రా తీస్తున్న వారినీ అరెస్టు చేశారు. నిర్వాహకులను అరెస్టు చేసిన తర్వాత గానీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఏదో వస్తువు వస్తుందనే ఆశతో ఫిర్యాదుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఏజెంట్లను మాత్రమే నిలదీస్తూ డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న లక్కీ డ్రా సంస్థలపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.