ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వాడిన ఆయుధాల కోసం ఆదివారం చేపట్టిన అన్వేషణ ముగిసింది. పులివెందుల రోటరీపురం వాగులో మురికినీరు తొలగించి అన్వేషణ చేశారు. యంత్రాలతో మట్టి తొలగించి గాలించినా ఫలితం దక్కలేదు. రోటరీపురంవాగును మున్సిపల్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఆయుధాల కోసం రేపు సీబీఐ అధికారులు మళ్లీ అన్వేషించనున్నారు.
సునీల్ యాదవ్‌పై ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు (Viveka murder case) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka murder case) కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు తీసుకెళ్లారు. పులివెందులలో సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. కాగా మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే ఇరికించారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రి, భార్య లక్ష్మి ఆరోపించారు. ఏపీ కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్‌ను చూసేందుకు వచ్చిన వారిని జైలు అధికారులు అనుమతించలేదు.
ఇంట్లో తనిఖీలు
వివేకా ఇంటి పరిసరాల్లో సీబీఐ అధికారులు ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి... ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు.
రంగన్న వాంగ్మూలం కీలకం
కేసు దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి కాపలదారు రంగన్నను సీబీఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. చివరికి ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. సుమారు 45 నిమిషాలపాటు వాంగ్మూలం నమోదు చేసింది. రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని, హత్యకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ఆయన వివరించారని ప్రచారం జరిగింది. తన పేరు ఎవరికైనా చెబితే నరికి చంపుతానని ఎర్రగంగిరెడ్డి బెదిరించారని.. అందుకే తాను భయపడి ఎవరికీ ఏమీ చెప్పలేదని రంగన్న తెలిపారు. సీబీఐ అధికారులు తనపై ఈగ వాలనివ్వబోమని హామీ ఇచ్చినట్లు వివరించారు. న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చిన.. అనంతరం పులివెందులలో స్థానికులు, విలేకర్లతో రంగన్న ఈ విషయాలు వెల్లడించారు. న్యాయమూర్తికి ఏం చెప్పావని అడిగితే.. తనకు భయమేస్తోందని సమాధానం ఇచ్చారు. భయపడాల్సిన పని లేదని పదేపదే అడగ్గా.. అక్కడున్నవారి చెవిలో.. ఎర్ర గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్ దస్తగిరి, సునీల్‌కుమార్ పేర్లను చెప్పారు. అంతకు ముందు మాత్రం తాను న్యాయమూర్తితో ఏం చెప్పానో గుర్తులేదని రంగన్న అన్నారు.
వివేకా హత్య కేసు ఛేదించడం కోసం సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. హత్యకేసులో కీలక ఆధారాలైన ఆయుధాల కోసం అన్వేషణ చేపట్టింది. మురికి నీరు అంతా తొలగించి... గాలించినా ఫలితం లేకుండా పోయింది.
ఇదీ చదవండి: YS Viveka Murder Case: సునీల్ యాదవ్‌పై ప్రశ్నల వర్షం... లోతేటివాగులో ఆయుధాల అన్వేషణ