vijayawada family suicide case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విజయవాడలో నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగవంతం చేశారు. వేధింపుల ఆరోపణలతో సెక్షన్ 306 కింద నలుగురు వడ్డీ వ్యాపారులపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా... గణేష్, వినీత, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వడ్డీ వ్యాపారుల కోసం నిజామాబాద్‌కు పోలీసులు వెళ్లగా... అప్పటికే నిజామాబాద్, నిర్మల్‌లో నిందితులు పరారైనట్లు సమాచారం. నిందితుల కోసం స్థానిక పోలీసులతో కలిసి విజయవాడ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సెల్ఫీ వీడియో బహిర్గతం
vijayawada Family suicide case selfie video: ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ కుటుంబం సెల్ఫీ వీడియో బహిర్గతమైంది. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని పేర్కొన్న పప్పుల సురేశ్ సెల్ఫీ వీడియో విడుదలైంది. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడన్న సురేశ్... జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలకు పైగా వడ్డీలు చెల్లించానని ఆ వీడియోలో వెల్లడించారు. వడ్డీలు చెల్లించినా ఇల్లు జప్తు చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకం చేయించుకున్నారని... అధిక వడ్డీల కోసం గణేశ్ కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చాడని సురేశ్ వీడియోలో పేర్కొన్నారు. గణేశ్‌కు రూ.80లక్షల వరకు చెల్లించినట్లు వాపోయారు. ఆ వీడియోను ఇవాళ విడుదలైంది. ఈనెల 8న నిజామాబాద్‌కు చెందిన సురేశ్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ద్విచక్రవాహనాల ఆచూకీ లభ్యం
పప్పుల సురేష్ కుటుంబం తీసుకెళ్లిన రెండు ద్విచక్రవాహనాల ఆచూకీ సోమవారం లభ్యమైంది. మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్‌లో బైకులు ఉన్నాయి. ఈ బైకులపై సురేష్ దంపతులు, ఇద్దరు కుమారులు వెళ్లారు. ఒకటి సొంత వాహనంకాగా.. మరొకటి అపార్టుమెంట్లో ఉండే వారిది. బైక్ ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఇవాళ ఆచూకీ లభ్యమైంది. రామాయంపేట వరకు ద్విచక్ర వాహనాలపై వెళ్లి... అక్కడి నుంచి బస్‌లో హైదరాబాద్‌కు ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లి చివరకు విజయవాడ చేరుకుని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తెలంగాణకు చెందిన కుటుంబం బలవన్మరణం చెందింది. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అంత్యక్రియలు