క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు ఓ విద్యార్థి. ఎంటెక్ సీటు రాలేదన్న కారణంతో కాకతీయ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆశోక్ నగర్‌కు చెందిన షఫీ బీటెక్ పూర్తి చేశాడు. ఎంటెక్ ప్రవేశ పరీక్ష రాసినా కూడా సీటు రాకపోవడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడు విట్స్ కళాశాలలో బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్ చదివేందుకు ప్రవేశ పరీక్ష రాసినట్లు అతని తండ్రి తెలిపారు. ఒకపైవు ఎంటెక్ సీటు లభించకపోవడం.. మరోవైపు ఉద్యోగం దొరక్కపోవడంతో ఇంట్లో ఎప్పుడూ బాధపడుతుండేవాడని ఆయన పోలీసులకు చెప్పారు. తాము ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదని వాపోయారు. తమ కూమారుడు చాలా కాలంగా మానసికంగా ఇబ్బంది పడుతుండేవాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి నుంచి బయటికి వెళ్తున్నానని వాళ్ల అమ్మతో చెప్పి దిగువ మానేరు డ్యామ్ కాకతీయ కెనాల్ వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తమ్ముడికి ఫోన్ చేసి బైక్ డ్యామ్ కెనాల్ వద్ద ఉందని.. వచ్చి తీసుకుని వెళ్లాలని మేసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సాయంతో వెతికించగా.. షఫీ మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: