Jubilee hills Minor Girl Gang Rape Case : ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు.. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నాలు చేశారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. పోలీస్ కస్టడీలో భాగంగా నిందితులను మంగళవారం విచారించారు. ఈ క్రమంలోనే బాధితురాలితో పాటు వారు ప్రయాణించిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కారు డ్రైవర్‌కు అప్పగించారు. అతడు ఇన్నోవా కారును మెయినాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేశాడు. ఆ వ్యవసాయ క్షేత్రం ప్రభుత్వరంగ సంస్థ ఛైర్మన్‌దేనని నిందితులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై లైంగిక దాడులు జరిగినప్పుడు ఆ విషయం తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం నేరంగా పరిగణించిన పోలీసులు.. సాదుద్దీన్ సహా ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు తాఖీదులు పంపారు. మెర్సిడెస్ బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాధారాలు లభించడంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు.
పార్టీలో బాలికలు.. యువతులు.. అమ్నీషియా పబ్‌లో మే 28న జరిగిన పార్టీకి 182 మంది హాజరుకాగా, ఇందులో 70 మంది బాలికలు, యువతులు ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. 50 మంది బాలికలు, యువతులతో ఫోన్లో మాట్లాడి పబ్‌లో ఏం జరిగింది? బాధిత బాలికను ఎవరైనా అల్లరి చేశారా? ఆమె నృత్యం చేస్తున్నప్పుడు నిందితులు ఆమె వద్దకు వెళ్లారా? ఆమెతో సన్నిహితంగా మెలిగారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి పరోక్షంగా, ప్రత్యక్షంగా తెలిసిన 20 మంది సాక్షులను విచారించారు. కస్టడీకి తీసుకున్న నిందితుల్లో అయిదుగురు మైనర్ల విచారణ మంగళవారంతో ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిందితులను అధికారి సుదర్శన్ విచారించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి అక్కడి నుంచి జువైనల్ హోంకు తరలిస్తామని తెలిపారు. టీఐపీ(టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్)కు సంబంధించిన పిటిషన్‌పై కోర్టు అనుమతిస్తే.. ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో బాలిక నిందితులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు.
అంతా గమనిస్తూనే.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఏం చేయనున్నారని తొలి రోజు నుంచే గమనిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ ఠాణాలో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న సాదుద్దీన్, ఐదుగురు మైనర్లు పోలీసులకు దొరక్కుండా తలోదారి పారిపోయారు. ఇదే విషయాన్ని వారు విచారణలో అంగీకరించారు. బంజారాహిల్స్‌లో ఉంటున్న ఒక నిందితుడు తన తల్లి అప్పటికే ఊటీలో ఉండగా.. అక్కడికి చేరుకున్నాడు. మరొకరు నెల్లూరు ప్రాంతంలోని దర్గాకు వెళ్లి పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరు మధ్యవర్తుల ఆధారంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏ-5గా ఉన్న మైనర్ గుల్బర్గా ప్రాంతంలో చిక్కినట్లు సమాచారం. అత్యాచార ఘటన తర్వాతే వీరు పారిపోయి ఉంటారని, విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని నివృత్తి చేసుకునేందుకు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ బాధితురాలి తండ్రికి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో.. అలాంటిదేం లేదని పోలీసులు ఖండించారు.
ఇవీ చదవండి : జూబ్లీహిల్స్ కేసులో నిందితులకు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్..!