- ‘‘నల్లగండ్లకు చెందిన వ్యాపారి(56). కొడుకు, కోడలిని హనీమూన్‌కు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ పంపాలనుకున్నారు. వెబ్‌సైట్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. సదరు యాప్ ఉద్యోగులమంటూ ఫోన్ చేసిన వ్యక్తి వీసా తదితర సేవల కోసమని లింక్ పంపి రూ.3,37,698 వసూలు చేశారు.’’ - సైబర్ నేరగాళ్ల ఎత్తుగడకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
Fake shopping Web Sites Fraud : సౌందర్య ఉత్పత్తులు.. మందులు.. రసాయనాలు.. బ్యాంకు రుణాలు.. వంటి సేవల సమాచారానికి గూగుల్‌లో వెతుకుతున్నారా! అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకే ఒక్క అక్షరం తేడాతో నకిలీ వెబ్‌సైట్లను రూపొందించిన సైబర్ మాయగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. తెలివిగా బురిడీ కొట్టించి రూ.లక్షలు సొమ్ము తమ ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొద్ది రోజుల వ్యవధిలో 10కి పైగా ఫిర్యాదులందాయి.
ఎలా చేస్తున్నారంటే.. తమకు అవసరమైన వస్తువులు, సేవల కోసం నెటిజన్లు వెతికినప్పుడు కనిపించిన వెబ్‌సైట్లను క్లిక్ చేస్తారు. కృత్రిమ మేధ సాయంతో కొనుగోలుదారుల మొబైల్ నంబరు, ఈ-మెయిల్ తదితర వివరాలు నకిలీ వెబ్‌సైట్ల నిర్వాహకులు సేకరిస్తున్నారు. ఆ తర్వాత మొబైల్ నంబర్ల ద్వారా కొనుగోలుదారులకు ఫోన్‌చేసి వారికి అవసరమైన వస్తువులను ఇంటి వద్దకు చేర్చుతామంటూ ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు మెయిల్‌కు పంపుతున్నారు. వస్తువుల ధరతో పాటు, పన్నుల పేరుతో వేర్వేరు ఖాతాల్లో డబ్బు జమ చేయించుకుంటున్నారు. సమయానికి వస్తువులు చేరకపోవటం ఆరా తీసినపుడు మోసపోయినట్టు బాధితులు గుర్తిస్తున్నారు.