Bank Employee Fraud in Ramapuram Branch: బ్యాంకు అంటే నిఘా నేత్రాలు, అధికారుల ముందే పరిశీలనలు, ఉద్యోగులు, నిత్యం బ్యాంకుకు వచ్చే ప్రజలు వీరందరిని దాటుకుని దొంగతనం చేయాలనుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి ప్రదేశాల్లో బయటి దొంగల కన్నా ఇంటి దొంగలే ఎక్కువగా దోపిడీలకు పాల్పడిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో జరిగింది.
రామాపురంలో భారతీయ స్టేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న రవికుమార్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పని చేస్తున్న బ్యాంకులోనే నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ 55.15 లక్షల రుణం తీసుకుని.. వాటికి సంబంధించిన దస్త్రాలను మాయం చేశాడు. అయితే ఇదంతా ఓ వ్యక్తి ద్వారా బయటపడింది. బ్యాంకు పరిధిలోని రాచపల్లి పంచాయతీ గంగనేరుకు చెందిన అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఏడాది కిందట బంగారు నగలు తాకట్టు పెట్టి రూ 3.30 లక్షలు రుణం తీసుకున్నాడు. జులై 13న రుణం తాలుకూ సంబంధించి రూ.లక్ష నగదు జమ చేసేందుకు బ్యాంకుకు వచ్చి రవికుమార్కి ఇచ్చాడు. అయితే ఆ డబ్బులను బ్యాంకు ఖాతాకు జమ చేయకుండా తన సొంత ఖాతాకు జమ చేసుకున్నాడు.
సలాం మిగిలిన రూ. 2.30 లక్షలు చెల్లించి తాకట్టు పెట్టిన నగలు తీసుకెళ్లాలని సోమవారం బ్యాంకుకు రాగా.. రవికుమార్ చేసిన మోసం బయటపడింది. అయితే రవికుమార్‌పై అనుమానం వచ్చి గత 15రోజుల నుంచి అంతర్గతంగా బ్యాంకు అధికారులు విచారణ జరిపారని సమాచారం. విషయం బయటకు పొక్కడంతో బ్యాంకులో నగలు తాకట్టు పెట్టినవారంతా వచ్చి.. తమ బంగారు నగలు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరుగుతుందని.. సదరు ఉద్యోగిని సస్పెండ్ కూడా చేశామని ఎస్బీఐ ఆర్ఎం రామకృష్ణ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: