నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఓ వ్యక్తిని ఢీ కొట్టడమే కాకుండా.. గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించకుండా మానవత్వం మరిచి నిర్మానుష్య ప్రదేశంలో విసిరేశాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అతడి మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే.!
జనవరి 7న మియాపూర్‌కు చెందిన రామకృష్ణ.. ఓ వ్యక్తికి డబ్బులివ్వాలంటూ ఇంటి నుంచి బయలుదేరి కూకట్‌పల్లి డంపింగ్ యార్డులో మరుసటి రోజు శవమై కనిపించాడు. రామకృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కూకట్‌పల్లిలోని డంపింగ్ యార్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం రామకృష్ణదేనని పోలీసులు ధ్రువీకరించి దర్యాప్తు చేశారు. అతడికి ఎవరితో శత్రుత్వం లేదని, మృతుడి పర్సు, సెల్‌ఫోన్ కనిపించటం లేదని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహం లభించిన చోట సీసీట కెమెరాలు పరిశీలించారు. కెమెరాల్లో ఓ ఆటో అనుమానస్పదంగా కనిపించటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
సెల్‌ఫోన్‌తో చిక్కాడు..
అదే సమయంలో మృతుడి ఫోన్ తిరిగి పని చేస్తుండటంతో ఆ సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్న లతీఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనకు ఆ సెల్‌ఫోన్ సయ్యద్ షేర్ అలీ అనే ఆటో డ్రైవర్ విక్రయించాడని లతీఫ్ తెలిపాడు. షేర్ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దాంతో ఆటోడ్రైవర్.. రామకృష్ణను మియాపూర్‌లో ఆటోతో ఢీకొట్టినట్లు చెప్పాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించమని తన ఆటోలోనే ఎక్కించారని, ఆస్పత్రి బిల్లుకు భయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామకృష్ణను కూకట్‌పల్లి డంపింగ్ యార్డులో పారేసినట్లు వివరించాడు.
కఠిన చర్యలు
మృతుడి పర్సులో ఉన్న రూ.3 వేలు, సెల్‌ఫోన్ తీసుకుని పరారు అయినట్లు చెప్పాడు. షేర్ అలీ పరోక్షంగా రామకృష్ణ మృతికి కారణమయ్యాడని, అతడిని అరెస్టు చేసి సెల్‌ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ సురేందర్ తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగితే ముందుగా క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారమివ్వాలని ఏసీపీ సూచించారు.
ఇదీ చదవండి: బాలికపై అత్యాచార కేసులో నిందితునికి జీవితఖైదు