క్యాబ్‌లో శునకం మూత్రవిసర్జన చేసిందని అడిగిన డ్రైవర్‌పై దాడిచేసిన ఘటన బాచుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. శివరాంపల్లికి చెందిన అహ్మద్‌పాషా(38) ఓలా క్యాబ్ డ్రైవర్. ఈనెల 13న రాత్రి వంశీకృష్ణ మియాపూర్ నుంచి నిజాంపేట బాలాజీనగర్‌లోని తమ ఇంటికి తల్లిదండ్రులను పంపడానికి క్యాబ్ బుక్ చేశాడు. తల్లిదండ్రులు తమతో పాటు పెంపుడు కుక్కను తీసుకొని అహ్మద్‌పాషా క్యాబ్‌లో బయలుదేరారు. నిజాంపేట వద్ద శునకం కారులోనే మూత్ర విసర్జన చేసింది. కారు ఆపిన డ్రైవరు ‘శునకాన్ని దించండి లేదంటే మీరైనా దిగండి’ అని అభ్యర్థించాడు. నిబంధనల ప్రకారం పెంపుడు జంతువులను అనుమతించమని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని దంపతులు కుమారుడికి ఫోన్లో చెప్పారు. ఫోన్లోనే డ్రైవర్‌తో వంశీకృష్ణ వాగ్వాదానికి దిగాడు.
దంపతులు తమను ఇంటి వద్ద దింపాలని కోరడంతో ఇంటి వద్ద దిగబెట్టాడు. ఆ సమయంలో వంశీకృష్ణ, అతని సోదరుడు హరికృష్ణ, మరో నలుగురు వ్యక్తులు పాషాపై దాడిచేశారు. అతని చరవాణి, కారు తాళాన్ని లాక్కొని కేపీహెచ్‌బీ ఠాణాకు తీసుకెళ్లారు. తమ తల్లిదండ్రుల పట్ల డ్రైవర్ అమర్యాదగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడంతో డ్రైవర్‌ను విచారించారు. తనపైనే దాడి చేశారని.. తానే బాధితుడినని తన ఫిర్యాదును సైతం తీసుకోవాల్సిందిగా పాషా కోరాడు. మరుసటి రోజు రావాలని డ్రైవర్‌ను పోలీసులు విడిచిపెట్టారు.
నమోదు చేయకుండా..
శనివారం ఠాణాకు వచ్చిన డ్రైవర్ పాషాను పోలీసులు విచారణ నిమిత్తం ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని, బాచుపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుడు సాయంత్రం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం రావాలని సూచించారు. అనారోగ్యంతో ఆదివారం హాజరుకాలేనని బాధితుడు ఫోన్ చేశాడు. సోమవారం కనెక్టెడ్ క్యాబ్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ ఆధ్వర్యంలో సభ్యులు బాధితుడితో కలిసి ఠాణాకు వచ్చారు.
మూడు రోజులు గడిచినా బాధితుడికి న్యాయం చేయలేదని, పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. కనీసం జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. పాషా ఫిర్యాదుపై విచారణ చేపట్టిన బాచుపల్లి సీఐ కె.నరసింహారెడ్డి, వంశీకృష్ణ, హరికృష్ణతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: TWINS RAPE CASE: తల్లి ప్రోత్సాహంతోనే బాలికలపై అత్యాచారం.. ఐదుగురికి జీవిత ఖైదు