నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మాచెర్ల వద్ద ఓ బావిలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. ద్విచక్రవాహనంపై వెళ్తూ బావిలో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
విందుకు వెళ్లి తిరిగి వస్తూ...
డిచ్పల్లి బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న సత్యపాల్ రెడ్డి తోటి ఉద్యోగులతో ముగ్గురితో కలిసి మంగళవారం రాత్రి విందు చేసుకున్నారు. విందులోనే సంతోశ్ అనే మరో వ్యక్తి తల్లిని సత్యపాల్ దూషించారు. తర్వాత క్షమాపణ చెప్పేందుకు రాత్రి పది గంటల సమయంలో నందిపేట్ మండలంలోని సిద్ధాపూర్ వచ్చారు. అనంతరం అక్కడే భోజనం చేసి తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించారు.
హత్య చేశారని బంధువుల ఆరోపణ:
సమాచారం అందుకున్న ఏసీపీ రఘు, ఎస్హెచ్వో సైదేశ్వర్, ఎస్సై యాదగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య సంధ్య ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి మరణంతో తోటి ఉద్యోగులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పథకం ప్రకారం తోటి ఉద్యోగులే హత్య చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.