Honor killing in hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే నగరంలో మరో పరువు హత్య జరిగింది. బేగంబజార్ మచ్చి మార్కెట్ వద్ద నీరజ్ పన్వార్ అనే యువకున్ని.. ఐదుగురు దుండగులు కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబీకులు కక్షగట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. నీరజ్ పన్వార్‌ను దుండగులు.. దాదాపు 20 సార్లు కత్తులతో పొడిచినట్టు స్థానికులు చెప్పారు.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టాస్క్‌ఫోర్స్ సహా 4 బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీకెమెరాలను పరిశీలించగా.. 2 ద్విచక్రవాహనాలపై వెళ్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు, తర్వాత కత్తులతో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
"మా అబ్బాయి ఏడాది క్రితం నీరజ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నీరజ్ వివాహం తర్వాత అఫ్జల్‌గంజ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. అమ్మాయి కుటుంబం కక్షగట్టి కిరాతకంగా హత్య చేసింది. నీరజ్, సంజనకు 4 నెలల బాబు ఉన్నాడు. ఇంటి సమీపంలో దుకాణానికి వెళ్లినప్పుడు నీరజ్‌ను చంపారు. బైకులపై ఐదుగురు వచ్చి నా కుమారుడిని చంపినట్టు పోలీసులు వీడియోలు చూపించారు." - మృతుడి తండ్రి రాజేందర్
"మార్వాడీ అబ్బాయి నీరజ్, యాదవ్ అమ్మాయి సంజన.. ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్లు ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అమ్మాయి సంజన వారి కుటుంబ సభ్యులే నీరజ్‌ను హత్య చేశారని ప్రాథమికంగా గుర్తించాం. మృతుడు తండ్రి ఫిర్యాదు ఇచ్చారు. ఈ హత్య కేసులో ఐదుగురు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించాం. కేసు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. ఈ ఘటన 7:30 నిమిషాలకు చోటుచేసుకుంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం." -సతీశ్ కుమార్, గోశామహల్ ఏసీపీ
ఇవీ చూడండి: