అంగన్‌వాడీ కేంద్రానికి రావడం లేదంటూ ఓ టీచర్ చిన్నారి చేతిపై గరిటతో వాతలు పెట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో కలకలం రేపింది. గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై అంగన్‌వాడీ టీచర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో రాయబారపు వాసవి అనే నాలుగేళ్ల చిన్నారిపై అంగన్‌వాడీ కేంద్రానికి రావడం లేదని స్థానిక అంగన్‌వాడీ టీచర్ తన కూతురి చేతిపై గరిటతో వాతలు పెట్టినట్లు చిన్నారి తల్లిదండ్రులు బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాయపడిన బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు వైద్య చికిత్స అందించారు.
బూరుగుపాడు గ్రామానికి చెందిన రాయబారపు రమేష్, కుమారిల కుమార్తె రెండు రోజుల నుంచి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడం లేదు. కేంద్రంలో గుడ్లు తీసుకు వద్దామని నచ్చజెప్పి వాసవిని తీసుకుని నానమ్మ , తల్లి కుమారి అంగన్వాడీకి వెళ్లారు. అంగన్‌వాడీ కార్యకర్త.. కులం పేరుతో దూషించడమే కాకుండా చిన్నారిని లోపలికి లాక్కెళ్లి కుడిచేతిపై వాతలు పెట్టింది. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులు డోర్నకల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అంగన్‌వాడీ టీచర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ విషయంపై అంగన్‌వాడీ టీచర్ హైమావతిని వివరణ కోరగా తాను అసలు చిన్నారిపై ఎలాంటి చేయి చేసుకోలేదని, జరిగిన సంఘటనతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి: TS Schools New Timings: నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు పాత వేళలే..