పోడు భూముల ఆక్రమణ విషయంలో అటవీశాఖ అధికారులు, గిరిజనులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పండువారిగూడెంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు గిరిజనులు స్వల్పగాయల పాలయ్యారు. సుమారు 250 హెక్టార్లు భూమిని గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఇందులో 50 హెక్టార్లను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని క్రమంగా ఘర్షణ తలెత్తింది.
ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నామని... ఈ భూములే జీవనాధారమని గిరిజనలు వాపోయారు. వాటిని వదులుకుని తాము ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు వదులుకునేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
ఇదీ చదవండి: 'మత్తు' స్వీట్లు ఇచ్చి రూ.37 లక్షలు దోపిడీ!