Drunkards Hulchul in Kukatpally: అవసరానికి మించిన సంపాదన.. చేతి నిండా డబ్బులు.. బయటకు అడుగుపెడితే కారు. ఇంకేముంది సరదాలకు కొదవ లేదు. ఎవరినీ లెక్క చేయరు. డబ్బున్న బాధ్యతలేని యువత తీరిది. మద్యం మత్తులో రాత్రిళ్లు మితిమీరిన వేగంతో సామాన్య జనానికి ఇబ్బందులు సృష్టిస్తారు. ఇలాగే పీకలదాకా మద్యం సేవించి యువకులు వీరంగం సృష్టించిన ఘటన హైదరాబాద్ కూకట‌్‌పల్లిలో జరిగింది.
అమ్మాయిలపై చాక్లెట్లు విసురుతూ...
స్థానిక కేపీహెచ్‌బీ రోడ్డు నెం3 లో ముగ్గురు యువకులు మద్యం సేవించి కారుని వేగంగా నడిపి స్థానికులని భయబ్రాంతులకు గురిచేశారు. అలాగే అమ్మాయిలపైనా చాక్లెట్లు విసురుతూ నానా హంగామా చేశారు. తమకు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పలుకుబడి ఉంది.. తమను ఏమీ చేయలేరంటూ యువకులు వారించారు. స్థానికులు ఎంత చెప్పినా వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
'రాత్రి 10.30 సమయంలో ముగ్గురు వ్యక్తులు మద్యం బాగా తాగి ... కారులో వేగంగా వెళ్తున్నారు. జనాలు తిరిగే చోట అలా వెళ్లకూడదని ఆపితే ఆగకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ కారుని అతివేగంగా పదే పదే డ్రైవ్ చేస్తూ నానా హంగామా చేశారు. అందరం కలిసి వారిని ఆపి మందలించినా వినకుండా... మీరేం చేస్తారు మమ్మల్నీ మాకు రాజకీయ నాయకుల పలుకుబడి ఉందని ఇంకా రెచ్చిపోయారు. అలా వెళ్లడమే కాకుండా అమ్మాయిలపై చాకెట్లు విసురుతూ వీరంగం సృష్టించారు. ఎంత చెప్పినా వినకపోగా పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.'
-కృష్ణ, స్థానికుడు
ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు.. లక్ష్మీపతి నెట్‌వర్క్‌పై ఆరా.!