Engineering student died: వసతి గృహంపై నుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన హైదరాబాద్ వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణానికి చెందిన రమ్య(21) ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి శోభన్ రెడీమిక్స్ వాహనం డ్రైవర్. కుటుంబం ఉప్పల్‌లో నివాసముంటున్నారు.
ఇంటి నుంచి కళాశాల దూరంగా ఉండటంతో కొంత కాలంగా బీఎన్‌రెడ్డినగర్‌లోని లక్ష్మీ దుర్గా ఉమెన్స్ వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి హాస్టల్ రెండో అంతస్తుపైన ఉన్న రెయిలింగ్‌పై కూర్చుని స్నేహితులతో మాట్లాడుతోంది. ఒక్కసారిగా అదుపుతప్పి వెనక్కు పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక అమ్మ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమ్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.