Additional PP harassed with gun: చేతిలో గన్ ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరించిన ఓ న్యాయవాదికి కుటుంబీకులు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. వేధింపులు తాళలేక నేరుగా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..
గన్తో బెదిరింపులు
హైదరాబాద్ వనస్థలిపురం సీబీఐ కాలనీలో నివసించే అజయ్ కుమార్.. నాంపల్లి కోర్టులో 2021 వరకు ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా పనిచేశారు. అదే సంవత్సరం లైసెన్స్డ్ గన్ తీసుకున్నారు. గన్ చేతిలో పడటంతో అత్యుత్సాహానికి గురైన అజయ్.. ఇంట్లో వాళ్లను టార్గెట్ చేశాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి.. రాత్రి సమయంలో భార్యాపిల్లలకు గన్ పెట్టి బెదిరించేవాడు. అంతేకాకుండా వేధింపులకూ గురిచేసేవాడు. భర్తే కదా అని పిల్లలను బుజ్జగిస్తూ సర్ది చెప్పుకొంటూ వచ్చింది. ఇక రోజూ వేధింపులు ఎక్కువవుతుండటంతో భార్య విసిగిపోయింది.
పోలీసులకు ఫిర్యాదు
దీంతో భార్య వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా గన్తో తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి తుపాకితో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.. అలా జరిగిపోయింది..