Fake Raids in Gachibowli: ''ఓ సినిమాలో హీరో.. తన గ్యాంగ్‌తో కలిసి ఐటీ అధికారులమని చెప్పి అవినీతిపరుల ఇళ్లపై నకిలీ రైడ్స్ చేస్తారు. అలా వెళ్లిన ముఠా.. వివరాలు సేకరిస్తున్నట్లు నటించి ఇంట్లోని నగదును కాజేస్తారు. ఎలాగు అక్రమంగా సంపాదించారు కాబట్టి బాధితులు పోలీసులు కూడా ఆశ్రయించలేక చింతిస్తారు''. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో చాలా అరుదుగా చూస్తుంటాం. ఇదే తరహాలో ఓ గ్యాంగ్ సీబీఐ అధికారులమని ఓ ఇంట్లోకి ప్రవేశించి.. నగదు తీసుకుని పరారైపోయింది. కాకపోతే ఇక్కడ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయట పడింది. సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. బంగారం, డబ్బుతో పరారైన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది.
సినీ ఫక్కీలో చోరీ
Fake CBI Raids In Orange county: గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ కౌంటిలోని సి-బ్లాక్‌లో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అపార్టుమెంట్‌లోకి సీబీఐ అధికారులమంటూ ప్రవేశించిన ఆగంతుకులు... ఇంట్లోని కిలోకుపైగా బంగారం, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా... అసలు విషయం బయటపడింది.
అరగంటలో సొమ్ముతో పరార్
సీబీఐ అధికారులమంటూ లోనికి ప్రవేశించిన ఆగుంతుకులు... ఇళ్లంతా తిరిగి సోదాలు చేశారని బాధితులు తెలిపారు. అరగంటలో బంగారం, నగదు తీసుకొని ఉడాయించారని వాపోయారు.. అయితే సీబీఐ అధికారుల పేరిట ఇంటిని ఉడ్చేసింది నకిలీ అధికారులని తెలుసుకున్న బాధితులు ఉలిక్కిపడ్డారు.
తనిఖీలు చేయాలని చెప్పి..
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గచ్చిబౌలిలోని జయభేరి ఆరెంజ్ కౌంటీ అపార్ట్‌మెంట్ ప్రవేశద్వారం వద్ద... భద్రత సిబ్బందికి తాము సీబీఐ అధికారులమని చెప్పిన అయిదుగురు ఆగంతకులు లోనికి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. అపార్టుమెంట్‌లోని సి-బ్లాక్‌లో 110 నంబర్ ఫ్లాట్‌లో నివసించే భువన తేజ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ యజమాని సుబ్రమణ్యం, భాగ్యలక్ష్మి దంపతుల ఇంట్లోకి ప్రవేశించి... తనిఖీలు చేశారని చెప్పారు.
అదుపులో అనుమానితులు
ఆగంతుకులు ఇంట్లోకి వచ్చిన సమయంలో సుబ్రమణ్యం, ఆయన భార్యతో పాటు ఇద్దరు పిల్లలు, డ్రైవర్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను లాక్కొని... 134 తులాల బంగారం, రూ.50 వేలతో చెక్కేశారని తెలిపారు. వారికి ఎలాంటి వివరాలు చెప్పకపోవడం, తీసుకెళ్తున్న నగదు వివరాలు అందించకపోవడంతో అనుమానం వచ్చి గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సీసీ కెమారాల దృశ్యాలను పరిశీలించారు. బాధితులకు పరిచయస్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
ముమ్మర గాలింపు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ సీబీఐ అధికారుల ముఠా కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
నిన్న మధ్యాహ్నం జయభేరి ఆరెంజ్ కౌంటిలోని ప్లాట్ నంబర్ 110లో దోపిడీ జరిగింది. ఆ సమయంలో సుబ్రహ్మణ్యం, ఆయన భార్య భాగ్యలక్ష్మి, వారి పిల్లలు, డ్రైవర్ ఇంట్లో ఉన్నారు. సీబీఐ అధికారులమని చెప్పి నలుగురు వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడ్డారు. లాకర్ తాళాలు తీసుకుని 1,340 గ్రాముల బంగారు ఆభరణాలు, యాభైవేల నగదు తీసుకుని వెళ్లిపోయారు. 30 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని దుండగులు వెళ్లిపోయారు. కేసు నమోదు చేసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నాం.
- మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు
ఇదీ చూడండి: తుపాకులతో బెదిరించి 8 నిమిషాల్లో రూ.1.25కోట్లు స్వాహా!
ఘరానా మోసం.. లక్షలు స్వాహా చేసిన ఏటీఎంలో నగదు పెట్టే సిబ్బంది