ఖమ్మం జిల్లా వేంసూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి అధికారుల గుట్టు రట్టయింది. భూమి సర్వే చేసేందుకు ఓ రైతు వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఉప తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
భూసర్వేకు రెండు లక్షలు డిమాండ్:
సత్తుపల్లికి చెందిన తోట సాంబశివరావు అతని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వేంసూరు మండలంలోని 25 ఎకరాల మామిడి తోటను సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించినట్లు ఏసీబీ డీఎస్పీ మదన్‌మోహన్ తెలిపారు. సర్వే చేసి నివేదిక ఇచ్చేందుకు ఉప తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్ కలిసి రైతు సాంబశివరావు నుంచి రెండు లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆయన వెల్లడించారు. దీంతో రైతు లక్షన్నరకు బేరం కుదుర్చుకుని లక్ష ముందుగా ఇస్తానని చెప్పా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం సాంబశివరావు లక్ష రూపాయలు తీసుకుని వెళ్లగా.. రెవెన్యూ అధికారుల కారులో నగదు పెడుతుండగా ఏసీబీ అధికారులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆధారాలతో సహా ఉప తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రైతుల సంబురాలు
ఏసీబీ దాడుల్లో ఉప తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్ ఏసీబీకి దొరికి పోవడంతో మండలంలోని పలువురు రైతులు కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ రమణ మూర్తి, ఎస్సైలు సతీశ్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.