తనను ప్రేమించి గర్భవతిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన యువతి(21) జిల్లెలగూడ లలితానగర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. దేవరకొండకు చెందిన విజయ్‌కుమార్(25)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజుల పాటు వారిద్దరూ ఒకే చోట కలిసి ఉన్నారు.
గత నెల 14న లలితానగర్‌లోని వృద్ధ దంపతులకు ఈ యువతి కరోనా టీకా పేరుతో మత్తుమందు ఇచ్చి వారి నగలు తస్కరించింది. ఈ కేసులో పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. ఇటీవల బయటకు వచ్చిన తరువాత ఆమె విజయ్‌కుమార్‌ను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. తనను కలువకపోగా, ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితురాలు పేర్కొంది. గతంలో అతనితో దిగిన ఫొటోలను పోలీసులకు అందజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
- ఇదీ చూడండి: 'రైతులకు భవిష్యత్తు ఉందని యువత నిరూపించాలి'