ఓ ద్విచక్రవాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొట్టిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో హరీశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
జిల్లాలోని ధర్మసాగర్ వైపు నుంచి కాజీపేట్కు వెళుతున్న లారీ మడికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న శీలం హరీశ్( 23) అనే యువకున్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల భాగం చిద్రమైన యువకుడు ప్రమాదస్థలిలోనే మృతి చెందాడు. ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు లారీలను గ్రామంలోకి అనుమతించకూడదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదంటూ రెండు గంటల పాటు రోడ్డుపై కూర్చున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ సీఐ రవికుమార్ గ్రామస్థులకు సర్దిచెప్పి రాత్రి 10 గంటలకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ జేమ్స్ అరెస్ట్