తరగతి గదిలో అతను అందరికంటే ఎత్తు. వయసూ ఎక్కువే. వివిధ కారణాల వల్ల 8వ తరగతిలో చేరాడు. ఇతడిని చూసి తోటి పిల్లలు ఆట పట్టించసాగారు. దీంతో తాను ప్రైవేటుగా పదో తరగతి చదువుతానని తల్లి, కుటుంబ సభ్యులతో మొర పెట్టుకున్నాడు. వారు కాదన్నారు. ఎటూ పాలుపోక, మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా, కొత్తగడి గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన ఓ బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. తరగతి గదిలో అందరూ నా కంటే చిన్నవారేనని, అందరికంటే పెద్దగా ఉన్నందున పిల్లలు గొడవ చేస్తున్నారని, సార్వత్రిక పదో తరగతి చదువుతానని అన్నాడు. కుటుంబ సభ్యులు మాత్రం అందరితోపాటు చదివితేనే బాగుంటుందని తేల్చి చెప్పారు. దీంతో ఆ బాలుడు సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకున్నాడు. బయటికి వెళ్లిన తల్లి, అన్న ఇంటికి వచ్చే సరికి తలుపులు వేసి ఉంచడంతో గ్రామస్థుల సాయంతో విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. చీరతో ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే అతన్ని వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విచారకరమైన సంగతి ఏమిటంటే నెల క్రితమే ఇతని తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే ఇలా కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.
ఇదీ చూడండి: చున్నీతో భర్తను చంపిన భార్య