ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు సైబర్ కేటుగాళ్లు. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ మహిళను బోల్తా కొట్టించారు. ఉద్యోగమిస్తామంటూ విడతల వారీగా రూ.7.47 లక్షలు కాజేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
జియో సంస్థలో అధికారినంటూ మోసం..
హైదరాబాద్లోని బోరబండలో నివసించే అన్నపూర్ణ.. ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నారు. షైన్.కామ్ ఆన్లైన్ జాబ్ పోర్టల్లో ఆమె తన ప్రొఫైల్ పెట్టారు. రెండు రోజుల క్రితం రాహుల్ జైన్ అనే వ్యక్తి ఫోన్ చేసి జియో సర్వీసెస్లో అధికారినంటూ ఆ మహిళతో పరిచయం చేసుకున్నాడు. మీ విద్యార్హతల ప్రకారం తమ కంపెనీలో ఎస్ఎంఎస్ విభాగంలో ఉద్యోగమిస్తామని బాధిత మహిళను నమ్మించాడు. అప్లికేషన్ ప్రాసెసింగ్, ఇంటర్వ్యూ, శిక్షణ, ఇతరత్రా ఖర్చుల పేరుతో రూ.7.47 లక్షలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు.
ఫోన్ నంబరు బ్లాక్ చేసేశాడు..
అనంతరం ఆమె ఫోన్ నంబరును బ్లాక్ చేసేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజధాని నగరంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట సైబర్ మోసాలకు ప్రజలు గురవుతూనే ఉన్నారు.
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి..
ప్రజలు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోకుండా అవగాహన కల్పించాలి. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ యువతకు వివరించాలి. అప్పుడే కొంతవరకైనా సైబర్ మోసాలకు గురి కాకుండా అరికట్టవచ్చు.