మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా ఎల్లారెడ్డి గూడ పరిధిలో రాజమణి అనే మహిళ.. భర్త, ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది. ఆమె ఈనెల 5 నుంచి కనబడకుండా పోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. ఎవరి పైన అనుమానం ఉందా అని అడగగా.. తమకు అశోక్ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు వారు చెప్పారు.
గొంతు నులిమి చంపాడు
పోలీసులు వెంటనే అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదటగా తనకు సంబంధం లేదని చెప్పిన అతను.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. రాజమణిని తానే చంపినట్లు చెప్పాడు. గొంతు నులిమి హత్య చేసినట్లు అగీకరించాడు. పోలీసులు అతడిని మృతదేహం పూడ్చిపెట్టిన ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు.
హత్య ఎందుకు చేశాడంటే..?
నిందితుడు అశోక్ (36) పదేళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడే స్వీపర్‌గా చేరిన రాజమణితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పట్నుంచి వారిద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 6 నెలల క్రితం అశోక్ కాప్రా మండలం ఎల్లారెడ్డి గూడకు భార్యా పిల్లలతో మకాం మార్చాడు. ఎల్లారెడ్డి గూడలో రాజమణిని కలిసేందుకు వేరుగా మరో గదిని తీసుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
భార్యాభర్తల మధ్య గొడవ
కొన్ని రోజుల క్రితం వీరి విషయం అశోక్ భార్యకు తెలియటంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమణి మరొకరితో సంబంధం కొనసాగిస్తోందని అశోక్ అనుమానించాడు. పథకం ప్రకారం రాజమణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 5న ఉదయం 11 గంటలకు రాజమణిని తన గదికి రమ్మన్నాడు. అక్కడ వారి మధ్య గొడవ జరిగింది. అశోక్ అక్కడే ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం నీటి డ్రమ్ములో మృతదేహాన్ని తీసుకొని శామీర్‌పేట పరిధిలోని లాల్గాడి మలక్‌పేట గ్రామ శివారులోకి వెళ్లాడు. తన మామ కాపాలదారుగా పనిచేస్తున్న వ్యవసాయ పొలం పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.
ఇదీ చదవండి: యువతి గొంతు కోసిన యువకుడు.. ప్రేమ వ్యవహారమే కారణం..!
GANG RAPE: వేటకొడవళ్లతో బెదిరించి.. భర్తను కట్టేసి.. భార్యపై అత్యాచారం