ఖమ్మం జిల్లా వైరా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కొండకొడిమ గ్రామానికి చెందిన కోటా మరియమ్మ(35) కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ గ్రామంలోనే నివసిస్తోంది. భర్త నాగకోటి తల్లిదండ్రుల తరపున ఉన్న సుమారు మూడున్నర ఎకరాల పొలంలో సగభాగంలో వ్యవసాయం చేసుకుంటోంది. మరో సగం ఈమె ఆడబిడ్డ లాలమ్మ సాగు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాను సాగు చేస్తున్న పొలంలోకి నీరు రాకుండా ఉద్దేశపూర్వకంగా భర్త వైపు ఉన్న వారు ఇబ్బందులు సృష్టిస్తున్నారని, రాకపోకలకు అడ్డు తగులుతూ వేధిస్తున్నారని వారం కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పలుకుబడితో ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
స్టేషన్‌కు వచ్చి పురుగుల మందు తాగి..
బుధవారం పోలీసు స్టేషన్‌కు వచ్చి పురుగు మందు తాగింది. పోలీసులు సరిగా స్పందించడం లేదని, తనకు పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇది గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
సమాచారం ఇచ్చాం.. ఈ లోపే ఇలా..
మరియమ్మ ఫిర్యాదు మేరకు ఆడబిడ్డ లాలమ్మ, ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని ఎస్సై సురేశ్ తెలిపారు. ఆమె సాగు చేసే పొలానికి ఎటువంటి అవరోధాలు సృష్టించవద్దని హెచ్చరించామన్నారు. భర్త, ఇతరులను కూడా స్టేషన్‌కు రావాలని సమాచారం ఇచ్చామని ఈ లోపు సంఘటన జరిగిందన్నారు. ఫిర్యాదుపై వెంటనే రసీదు ఇచ్చి స్పందించామన్నారు.
ఇవీ చూడండి: Gandhi Hospital Rape: గాంధీ ఘటనలో వీడని చిక్కుముడి.. ఇంకా లభించని బాధితురాలి ఆచూకీ