వరంగల్ గ్రామీణ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక హత్య కేసులో నిందితుడిని విచారిస్తున్న పోలీసులకు మరో విస్తుపోయే నిజం తెలిసింది. అప్పటి వరకు నిందితుడు ఒకే హత్య చేశాడనుకుంటున్న పోలీసులకు.. తాను చంపింది ఒకరిని కాదు ఇద్దరిని అని స్వయంగా ఒప్పుకోవడంతో ఖంగుతినడం ఖాకీల వంతైంది.
ఏనుగల్లు గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి ఏడేళ్ల క్రితం తన మొదటి భార్య పద్మను అదనపు కట్నం కోసం హత్య చేశాడు. విషయం మూడో కంటికి తెలియకుండా ఆమె మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టాడు. అనంతరం అంజలి అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక పద్మ తరహాలోనే అంజలినీ హతమార్చి.. కటకటాల పాలయ్యాడు.
పద్మ హత్య కేసులో పోలీసులు నిందితుడు కిరణ్‌ను విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తాను చేసింది ఒక హత్య కాదని, రెండు హత్యలని కిరణ్ చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. మొదటి భార్య పద్మ, రెండో భార్య అంజలి ఇద్దరినీ హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో ఈ మిస్టరీ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ మేరకు నిందితుడి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన మొదటి భార్య పద్మ కళేబరాన్ని వెలికి తీశారు. స్థానిక తహసీల్దార్, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో వెలికి తీసిన ఎముకలు, పుర్రెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అకారణంగా ఇద్దరు భార్యలను చంపిన నిందితుడు కిరణ్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.