బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో జరిగింది. సాంగ్లే జిల్లా కిల్లమచ్చెందర్ఘడ్ అనే గ్రామానికి చెందిన రోహిత్ భార్య పూజతో కలిసి ఏపీలోని తూర్పుగోదావరిలో రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ యూత్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్‌లో సంగారెడ్డి జిల్లా ముత్తంగి డీఎన్ కాలనీలో ఉంటున్న నరసింహులుతో పరిచయం ఏర్పడింది.
రెండు నెలల క్రితం రోహిత్ అనారోగ్యానికి గురికావటంతో భార్య పూజతో కలిసి మహారాష్ట్ర వెళ్ళిపోయాడు. నరసింహులు సూచనలతో ఈనెల 9న రోహిత్ సంగారెడ్డి జిల్లా ముత్తంగికి వచ్చాడు. 11న రోహిత్‌కు నరసింహులు ఫోన్ చేయగా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో తనకు పని దొరికిందని తెలిపాడు.
అనంతరం గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కుళ్లిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: అదృశ్యమైన బాలుడు.. మృతదేహామై గుర్తింపు