భార్యను కాపురానికి పంపించడం లేదని అత్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఆల్వాల గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. సట్టి నాగేంద్ర, రామస్వామి కుమార్తె శ్రావణితో పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన తుమ్మ నాగరాజుకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. నాగరాజు మద్యం సేవించి భార్య శ్రావణితో తరచూ గొడవ పడడంతో... ఆమె పుట్టింటికి వచ్చింది.
నాగరాజు ఆల్వాల వచ్చి భార్యతో గొడవపడినట్లుగా పోలీసులు తెలిపారు. శ్రావణి పక్కింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త నాగేంద్ర గొంతును బ్లేడుతో గొంతు కోయడానికి యత్నించాడని వెల్లడించారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చారని... వెంటనే నాగరాజు పరారైనట్లు వివరించారు.
అప్పటికే నాగేంద్ర గొంతుకు స్వల్ప గాయాలు కాగా... నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: పోలీసులే ఖంగుతినేలా చేసిన సైకో కిల్లర్.. ఏం జరిగిందంటే?