వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన బ్యాగరి లక్ష్మికి తాండూర్‌కు చెందిన బాలప్పతో 15 ఏళ్ల కింద వివాహమైంది. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావటంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆమె తండ్రి కూడా చనిపోవటంతో ఇంటికి పెద్దదిక్కుగా మారింది. తల్లితో పాటు ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తోంది.
కొంత కాలం క్రితం పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన నర్సింగ్‌తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అతను ఆమె వద్ద 50 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఎంతకు ఇవ్వకపోవటంతో ఆమె అతనిపై ఒత్తిడి తీసుకొచ్చింది. డబ్బులు ఇస్తానని నమ్మించిన నర్సింగ్.. నెల రోజుల కింద హాస్యం గ్రామసమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు. హత్య జరిగి చాలా రోజులు కావటంతో అడవిలో ఉన్న ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. గ్రామస్థులకు దుర్వాసన రాటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడే మృతదేహానికి శవపరీక్ష చేయించారు. కేసు నమోదు చేసుకోని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: తప్పుడు సర్టిఫికెట్లు పెట్టినందుకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా