రెండేళ్ల చిన్నారిని అమ్మేందుకు ఓ కసాయి తండ్రి చేసిన ప్రయత్నాన్ని స్థానికుల చొరవతో పోలీసులు, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకున్నారు. తండ్రి నిర్వాకానికి బలికాకుండా ఆ చిన్నారిని కాపాడారు. ఈ సంఘటన కర్నూల్ జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన బాలరాజు... కర్నూల్ జిల్లా లింగాల గట్టులో తన కూతుర్ని విక్రయించే ప్రయత్నం చేశాడు .
ఏం జరిగింది?
కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన వ్యక్తి ఒప్పంద పత్రం రాసివ్వాలని కోరారు. బాండ్ పేపర్ కోసం బాలరాజు ఓ దుకాణానికి వెళ్లగా దుకాణ యజమాని ఒప్పంద పత్రం ఎందుకన్న వివరాలు ఆరా తీశారు. తన కూతురుని అమ్మేందుకని బాలరాజు చెప్పడంతో అతను స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తకు సమాచారం అందించారు. ఆమె పోలీసులకు, జిల్లా శిశుసంక్షేమ శాఖ అధికారులకు విషయాన్ని చేరవేశారు. బాలరాజు నివాసం నాగర్ కర్నూల్ జిల్లా కావడంతో అక్కడి అధికారులకు సమాచారం అందించారు.
చిన్నారి క్షేమం
సంఘటనా స్థలానికి చేరుకున్న నాగర్ కర్నూల్ జిల్లా ఐసీడీఎస్ అధికారి దమయంతి స్థానిక సర్పంచ్ శారద, ఈగలపెంట పోలీసుల సమక్షంలో చిన్నారిని తీసుకున్నారు. మహబూబ్‌నగర్ శిశు విహార్ శనివారం తరలించనున్నారు. బాలరాజును ఈగలపెంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతేడాది జూలైలో తన భార్యను హత్య చేసిన కేసులో జైలుకెళ్లి ఇటీవలే విడుదలైనట్లు తెలిసింది. దొంగతనం కేసులోనూ జైలుకు వెళ్లినట్లు సమాచారం.
ఇదీ చదవండి: రూ.720 కోసం ఘర్షణ.. బలైపోయిన కూలీ