కర్ణాటక బీదర్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ట్రక్కులో తరలిస్తున్న 91.50 కిలోల అల్ప్రజోలంను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. కోలార్ పారిశ్రామికవాడలోని ఇందూ డ్రగ్స్ పరిశ్రమలో ఎన్‌సీబీ సోదాలు చేసింది. కంపెనీలో ముడిసరకుతో పాటు యంత్రాలను ఎన్‌సీబీ సీజ్ చేసింది. బీదర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ దాడులు నిర్వహించారు.
ఐదుగురు అరెస్ట్
ఈ కంపెనీ నిర్వాహకుడు హైదరాబాద్‌కు చెందిన ఎన్.వి.రెడ్డి నివాసంలో ఎన్‌సీబీ సోదాలు చేసింది. రూ.62 లక్షలను స్వాధీనం చేసుకోవడంతోపాటు.. ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. అల్ప్రజోలంను తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న భాస్కర్, వైవీ రెడ్డి, మీనన్, అమృత్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎన్.వి.రెడ్డిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు..
బీదర్ నుంచి హైదరాబాద్‌కు తరలించి అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అల్ప్రజోలం సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ మత్తు పదారార్థాలను కల్లులో కలపడం వల్ల దాన్ని సేవించిన వాళ్లు మత్తులో తూలుతారని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మెదడు, నరాల సంబంధిత వ్యాధులు ఏర్పడుతాయి. ఈ పదార్థాలను నిషేధించినప్పటికీ... స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి, పలు మార్గాల్లో సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.
కేసులు నమోదు
ఎన్సీబీ, పోలీసు, ఎక్సైజ్ అధికారుల దాడుల్లో అల్ప్రజోలంను పట్టుబడితే కేసులు నమోదు చేసి సరఫరాదారులను అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: పుట్టినరోజు ఆ ముగ్గురు అమ్మాయిలతో..!