Tribal University arrangements in Telangana: ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ట్రైబల్ యూనివర్సిటీల కోసం రూ.44 కోట్ల నిధులు కేటాయింటారు. అప్పటి పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రస్తావన వచ్చింది. అప్పటి నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్డీ) విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. నవంబర్‌లో జరగనున్న సమావేశాల్లో అవసరమైన బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర కసరత్తు చేస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు.
జాకారం వైటీసీలో తరగతుల నిర్వహణకు అవకాశం.. హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ) ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. పార్లమెంటులో ఆమోదం పొందాక అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల హనుమకొండలో జరిగిన భాజపా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీకి అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.800 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
పార్లమెంటు బిల్లు ఆమోదం తర్వాత సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) ద్వారా భవన సముదాయాల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులు చేపడతారు. అలాగే హెచ్‌సీయూకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. వీసీని నియమించి, తరగతుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. సీట్ల కేటాయింపులు నిర్వహించి తరగతులు ప్రారంభిస్తారు. భవనాలు అందుబాటులోకి రాకున్నా తాత్కాలికంగా జాకారం వైటీసీలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.
స్థల కేటాయింపు పూర్తి.. గిరిజన విశ్వవిద్యాలయం కోసం ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో ప్రతిపాదిత స్థల సేకరణ పూర్తయ్యింది. మొత్తం 335 ఎకరాల భూమిని గిరిజన సంక్షేమ శాఖకు ఏడాది కిందట అప్పగించారు. రెవెన్యూశాఖకు చెందిన 285, అటవీశాఖకు చెందిన 55 ఎకరాలున్నాయి.
ములుగుకు ప్రత్యేక గుర్తింపు.. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మరింత అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ఇక్కడికి వచ్చే సిబ్బంది అవసరాల మేరకు వ్యాపారాలు కూడా పెరుగుతాయి. ఈ ప్రాంతం ఉన్నత విద్యాపరంగా గుర్తింపు లభిస్తుంది. ములుగు జిల్లాలో వర్సిటీ ఏర్పాటైతే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది.
స్థానికులు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 163 జాతీయ రహదారి ములుగు జిల్లా మీదుగానే వెళ్తుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు సైతం రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ వరకు వాయుమార్గం ద్వారా చేరుకుని, ఇక్కడికి రోడ్డు మార్గంలో రావొచ్చు. వరంగల్ వరకు రైలు మార్గాన వచ్చి అక్కడి నుంచి రహదారిపై గంట ప్రయాణం చేసి చేరుకోవచ్చు. గిరిజన విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వారికి ఉన్నత విద్య అందుతుంది.
ఇవీ చదవండి: