రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పీసీసీ... తెరాసపై పోరు ఉద్ధృతం చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలతో.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ.. పార్టీ శ్రేణుల్లో ఊపును తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు మోసపూరితమంటూ.. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సభలు నిర్వహిస్తూ... ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంద్రవెల్లి, రావిర్యాలల్లో నిర్వహించిన రెండు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు... విజయవంతం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పేరుతో... దళిత, గిరిజనులకు మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
ఘనంగా వరంగల్‌లో ముగింపు సభ
పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా నిర్వహిస్తున్న సభల్లో భాగంగా... దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభను.. వరంగల్ జిల్లాలో నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. క్విట్ ఇండియా దినోత్సవం రోజున ఈ నెల 9న ప్రారంభించిన దళిత గిరిజన సభల్ని.. సెప్టెంబర్ 17న జరిగే సభతో ముగించనుంది. 2004 ఎన్నికల ముందు వరంగల్‌లో బీసీ గర్జన పేరుతో.. భారీ బహిరంగ సభను నిర్వహించి...ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇందుకు బీసీ గర్జనసభ ఎంతో దోహదం చేసిందన్న విశ్వాసం కాంగ్రెస్‌లో ఉండడంతో.... తాజాగా అదే సెంటిమెంట్‌ను అనుసరించి ముగింపు సభ నిర్వహించాలని నిర్ణయించారు. బీసీ గర్జన సభకు సోనియా గాంధీ రాగా.. ఇప్పుడు వరంగల్‌లో నిర్వహిస్తున్న సభకు రాహుల్ గాంధీని పీసీసీ ఆహ్వానిస్తోంది.
రేవంత్ పీసీసీ చీఫ్‌గా నియామకమయ్యాక.. పార్టీలో నాయకులను, పార్టీ శ్రేణులను వరుస కార్యక్రమాలతో పరుగులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఇదీ చూడండి:
Rahul Telangana Tour: కాంగ్రెస్‌లో కొత్త జోష్... వచ్చే నెల 17న రాష్ట్రానికి రాహుల్!