మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మహబూబాబాద్ జిల్లాలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 115 మందిలో ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ హోమ్ క్వారంటైన్ చేశామని, అందులో 70 మంది హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నారని ప్రకటించారు.
ప్రతిఒక్కరూ లాక్డౌన్ పాటించాలని ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడపాలని.. అదే మీరు రాష్ట్రానికి, దేశానికి చేసే గొప్ప సేవ అన్నారు. విదేశాల నుండి జిల్లాకు వచ్చి సమాచారం ఇవ్వకుండా బయట తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్కు తరలించామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పాస్పోర్ట్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు కరోనా బాధితులను చిన్నచూపు చూడొద్దని కోరారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ ఛైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రోడ్లపై ఇష్టారాజ్యంగా కంచెలు.. లైన్‌మెన్ బలి