'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు ఓరుగల్లులో గురువారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్‌లో ఉంటున్న కాకతీయుల 22వ వారసుడైన కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ పూర్వీకులు పాలించిన వరంగల్ కోటలో గాలిలోకి బెలూన్లు ఎగరేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, ఎంపీ దయాకర్, నగర మేయర్ సుధారాణి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతులు కమల్‌చంద్రకు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఆయన భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. వందలాది మంది డప్పు కళాకారులు, బోనాలతో మహిళలు చంద్రదేవ్‌ను ఆహ్వానించారు. భద్రకాళి బండ్‌పై కమల్‌చంద్ర మొక్క నాటారు. పోచమ్మమైదాన్ కూడలికి వెళ్లి రాణి రుద్రమదేవి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత వరంగల్ కోటకు వెళ్లారు. కోట పడమటి ద్వారం నుంచి గుర్రాల బొమ్మలున్న ప్రత్యేక వాహనంలో ఆయనపై పూల వర్షం కురిపిస్తూ మధ్య కోట వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కోటలోని శంభులింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశాక, కీర్తి తోరణాలను సందర్శించారు. కోట నుంచి వేయిస్తంభాల ఆలయానికి విచ్చేసి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. చివరగా హనుమకొండలోని అగ్గలయ్య గుట్టను సందర్శించిన కమల్‌చంద్ర రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన చిత్ర ప్రదర్శనలో పాల్గొన్నారు.
భద్రకాళి ఆలయం, వరంగల్ కోటలో కమల్‌చంద్ర మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో కాకతీయులు అనేక చెరువులు తవ్వించి ప్రజలకు ఎంతో మేలు చేశారని, తాము బస్తర్‌లో సైతం చెరువుల పరిరక్షణకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తమ మూలాలున్న వరంగల్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోటలోని కీర్తి తోరణాలు చాలా సుందరంగా ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో ఈ చిత్రాన్ని చేర్చడం గొప్ప విషయమని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ గెజిట్‌లో తమ తాత మహారాజ ప్రవీర్‌చంద్ర భంజ్ కాకతీయ అని ఉన్నదని.. తాము కాకతీయుల వారసులమని చెప్పడానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్సవాలను జరుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కమల్‌చంద్ర ధన్యవాదాలు తెలిపారు.
కాకతీయులలాగే కేసీఆర్ పాలన
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాకతీయులు తమ ప్రజల కోసం పోరాటాలు చేసినట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అస్థిత్వం కోసం పోరాడి రాష్ట్రం సాధించారని, కాకతీయుల స్ఫూర్తితోనే పాలన అందిస్తున్నారని అన్నారు. ‘మిషన్ కాకతీయ’ లాంటి అద్భుత పథకం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దని, ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్, కాకతీయుల కట్టడాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఇప్పుడు కాకతీయుల నాటి వైభవాన్ని తేవడానికే ఇలాంటి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఘనంగా ఏర్పాట్లు చేశారని అభినందించారు.
కమల్‌చంద్ర నేపథ్యమిదీ..!
కమల్‌చంద్ర భంజ్‌దేవ్ తాత ప్రవీర్ చంద్రభంజ్. తండ్రి భరత్‌చంద్ర భంజ్‌దేవ్. ప్రవీర్ చంద్రకు బస్తర్‌లో గుడి కట్టారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన పోరాటం చేయడమే కాకుండా రాజకీయ పార్టీని స్థాపించి 1957లో బస్తర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండేళ్ల తర్వాత రాజీనామా చేశారు. ఆదివాసీలను సాయుధులుగా మారుస్తున్నారని.. 1966లో అప్పటి అవిభాజ్య మధ్యప్రదేశ్ పోలీసులు ప్యాలెస్‌లో జరిపిన కాల్పుల్లో ప్రవీర్ కన్నుమూశారు. తర్వాత వీరి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. మళ్లీ 2013లో కమల్‌చంద్ర భంజ్ భాజపాలో చేరడంతో ఆయనకు రమణ్‌సింగ్ ప్రభుత్వం కేబినెట్ హోదా గల ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర యువజన కమిషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చింది. ప్రస్తుతం కమల్‌చంద్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి : చరిత్ర రచనలో కాకతీయ గుడులు, శిల్పాలు పోషిస్తున్న పాత్రేంటి?