Etela on cm kcr: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ధరణి పోర్టల్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన భాజపా కార్యకర్తల శిక్షణా తరగతులకు ఈటల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల పాత్రపై సూచనలు చేశారు.
సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈటల ఆరోపించారు. భూ ప్రక్షాళన పేరుతో.. కబ్జా కాలమ్‌ను తొలగించారన్నారు. దీంతో మాన్యాల రూపంలో, పోరాటాల ఫలితంగా, అనేక ఏళ్ల క్రితం కొనుగోలు చేసి సాగుచేస్తున్న భూములకు రిజిస్ట్రేషన్లు లేవని.. ఫలితంగా ఆయా భూములను కాపాడుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అలాగే నిషేధిత భూములకు సంబంధించి 15 లక్షల ఎకరాలపై 60 వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ధరణి తెచ్చిన తంటాలపై ఎక్కడా పరిష్కార వేదికలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే నిపుణులతో చర్చించి.. సమస్యల నుంచి రైతులను బయటపడేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
'కేసీఆర్ నియంతృత్వ పోకడలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి తెచ్చిన తంటాలపై పరిష్కార వేదికలు లేవు. ఎన్వోసీల కోసం లంచాలు ఇస్తే తప్ప క్లియర్ కావడం లేదు. భూప్రక్షాళన, ధరణి పేరిట రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.'
- ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇదీచూడండి: paddy procurement telangana: రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్