Medaram Jathara: మేడారం మహాజాతరలో కోటి ముప్పై లక్షలకుపైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని ప్రభుత్వం అంచనా. జాతర ముగిసిన తరువాత ఆదివారం కూడా దాదాపు పదిలక్షలపైగా భక్తులు వచ్చి... గద్దెల వద్ద మెుక్కులు తీర్చుకున్నారు. ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతర ముగిసిన తరువాత వచ్చే బుధవారం నాడు.... ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగినందుకు వనదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆలయాలను శుద్ధి చేసి గద్దెల చెంత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపు కుంకుమలు సమర్పించి బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందులో పూజారులు కుటుంబ సమేతంగా పాల్గొంటారు. దీంతో మహాజాతర పూర్తయినట్లుగా భావిస్తారు. తిరుగువారం పండుగ రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గద్దెల చెంత పూజలు చేస్తారు.
హుండీల లెక్కింపు ప్రారంభం..
ఇక మేడారం జాతర హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు నేటి నుంచి ప్రారంభం కానుంది. హనుమకొండలోని TTD కల్యాణ మండపంలో ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 497 హుండీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య మేడారం నుంచి ప్రత్యేక బస్సుల్లో కల్యాణ మండపానికి తీసుకొచ్చి భద్రపరిచారు. పది రోజుల పాటు జరిగే లెక్కింపులో దేవస్ధానం సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు పాల్గొంటారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈసారి భారీ అంచనాలు..
ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో అధికారులు జమచేయనున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన జాతరలో 15 కోట్ల 54 లక్షల 71 వేల రూపాయల ఆదాయం లభించగా.. ఈసారి అంతకన్నా ఎక్కువే వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: