వరంగల్ నగరంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వ ఛీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. హన్మకొండలో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ కార్పొరేషన్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీల వివరాలు అంచనా వేసి వాటి పునరుద్ధరణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. అంచనా వ్యాయాన్ని సిద్ధం చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం మూలంగా పనులు ఆలస్యం అవుతున్నందున.. ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం చేసుకుంటూ పనులు చేయాలన్నారు. కాజీపేట, ప్రశాంత్ నగర్, ఎస్బీహెచ్ కాలనీల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, వచ్చే మంగళవారం కల్లా ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.